మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:52 IST)

తెరాసలో టీ టీడీపీ విలీనం : స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసు!

తెలంగాణ రాష్ట్ర సమితిలో టీ టీడీపీని విలీనం చేసినట్టు గుర్తించడంతో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన టిడిపి ఎమ్మెల్సీలను టిఆర్ఎస్‌ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో హైకోర్టు పేర్కొంది. 
 
మార్చి 9న తెలుగుదేశం ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండి సలీంలను టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి ఛైర్మన్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టిఆర్‌ఎస్‌ఎల్పీలో టిడిఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. 
 
దీన్ని సవాల్ చేస్తూ టిడిపి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు స్వామి గౌడ్‌కు నోటీసు జారీ చేసింది. అయితే,  స్వామిగౌడ్ హైకోర్టుకు వివరణ ఇస్తారా? ఇది తన పరిధిలోని వ్యవహారమని చెప్పి తప్పించుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.