బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (11:04 IST)

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు : స్తంభించిన జనజీవనం!

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. సోమవాం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడం రోడ్లపై నీరు చేరింది. మురుగు కాలువలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలో సోమవారం 58.9 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని, అత్యధికంగా చింతూరు మండలంలో 153 మిమి వర్షపాతం నమోదైందని జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి తెలిపారు. 
 
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సోమవారం జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు రోజువారి పనులను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇదిలావుండగా ఈ వర్షం ప్రభావం సింగరేణిపై కూడా పడింది. ఈ వర్షాల కారణంగా వరద నీరు గనులలోకి వచ్చి చేరడంతో దాదాపు 21 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా దాదాపు రూ.కోటి నష్టం వాటిల్లిందన్నారు. 
 
మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేయడం జరిగిందని, దీని ద్వారా 15,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేయడం జరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం 38.9 అడుగుల మేర ప్రవహిస్తుండగా సోమవారం సాయంత్రానికి అది 25 ఫీట్లకు చేరుకుంది.