బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (15:21 IST)

బావతో ముద్దూముచ్చట్లకు భర్త అడ్డుతగులుతున్నాడనీ...

బావతో వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతున్నాడని భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో సహా మరో ఇద్దరికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ కరీంనగర్ జిల్లా ఐదో అదనపు కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవిందులపల్లికి చెందిన అరుణతో ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లికి చెందిన గడ్డం రవీంద్‌ రెడ్డి (35)తో 1999లో వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు అనే ఇద్దరు సంతానం ఉంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే, రవీందర్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం అరుణకు ఏమాత్రం ఇష్టం లేదు. తన బావ అయిన పెద్దపల్లి మండలం రాజారాంపల్లికి చెందిన సింగిరెడ్డి సుధాకర్‌ రెడ్డిని పెళ్లి చేసుకుందామని అరుణ బావించగా, ఇంటి పెద్దలు రవీందర్‌ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపారు. 
 
సుధాకర్‌ రెడ్డి పత్తిపాకకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అత్తగారింటికి ఇల్లరికం వెళ్లాడు. అనుకోకుండా అరుణ ఆమె బావ సుధాకర్‌ రెడ్డిలు వారి బంధువుల శుభకార్యంలో కలుసుకోగా అరుణ తన ఇబ్బందులను తెలిపి అతనితో సాన్నిహిత్యం పెంచుకొంది. దాంతో ఇద్దరు సెల్‌ఫోన్‌లలో మాటామంతి జరుపుకుంటా.. శారీరకంగా దగ్గరయ్యారు. ఈ విషయం తన భర్తకు తెలిసి పలుమార్లు మందలించాడు. అయితే, బావతో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకోలేని అరుణ.. భర్తను మట్టుబెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం బావతో కలిసి అరుణ కుట్ర పన్నింది. 
 
ఈ కుట్రలో భాగంగా మిని ట్రాక్టర్‌పై ఒంటరిగా వెళ్తున్న భర్త గురించి తన బావకు సమాచారమందించింది. 2011 మే 18వ తేదీ అర్థరాత్రి పని ముగించుకొని ఇంటికి వస్తున్న రవీందర్‌ రెడ్డిని సుధాకర్‌ రెడ్డి చొప్పదండికి చెందిన క్యాతం ఫృథ్విరాజ్‌తో కలిసి వెంబడించి కొత్తూరు శివారులో అడ్డగించి గొడ్డలి, ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపారు. ఈ హత్యానేరం తనపై రాకుండా మరుసటి రోజున తమ గ్రామ సర్పంచ్‌ ద్వారా తన భర్త మరణించిన విషయం తెలిసిందని వెళ్లి ధర్మారం పోలీసులకు ఫిర్యాదు చేసి.. తన భర్త మరణానికి వేరొకరు కారణమని పేర్కొంది.  
 
అయితే, అరుణ వ్యవహారశైలిని పసిగట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆమెతో పాటు సుధాకర్‌ రెడ్డి, ఫృథ్విరాజ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ సంఘటనపై అప్పటి ధర్మారం ఎస్సై సదన్‌ కుమార్‌ కేసు నమోదు చేయగా సీఐ ఎం కిరణ్‌ కుమార్‌ దర్యాప్తు జరిపారు. ఈ కేసులో సాక్షులను అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలకిషన్‌ విచారించారు. ముగ్గురికి జీవిత ఖైదు ఒక్కొక్కరికి 500 రూపాయల జరిమాన విధిస్తూ గురువారం కోర్టు తీర్పును వెలువరించింది.