శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (10:39 IST)

తెలంగాణ ఎంఓఎస్‌లకు కేంద్రం నోటీసులు.. చర్యలే తరువాయి!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టీవీ చానళ్ళ ప్రసారాలను నిలిపివేసిన అంశంలో ఆ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార శాఖ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఛానళ్ళ ప్రసారం నిలిపివేయడం చట్ట విరుద్ధమని, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ నిబంధనలు, 1994లోని 16వ ఉప నిబంధన కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో తెలపాలంటూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎంఎస్‌వోలకూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అలాగే ట్రాయ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా చానళ్లను ఎందుకు నిషేధించారో ఆగస్టు 11వ తేదీ నాటికి తెలపాలంటూ టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎంఎస్‌వోలకూ నోటీసులు జారీచేసింది. 
 
ట్రాయ్‌ డిప్యూటీ అడ్వైజర్‌ జీఎస్‌ కేశ్వానీ సంతకంతో గురువారం ఈ నోటీసును జారీ చేసింది. అందులో తెలంగాణలో కేబుల్‌ ఆపరేటర్లు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్లను జూన్‌ 16 నుంచి నిలిపివేసిన విషయం మా దృష్టికి వచ్చింది. ఇలా చానళ్ల ప్రసారాలను నిలిపి వేయడానికి కారణాలు తెలుపుతూ మూడు వారాల నోటీసు ఇవ్వకుండా వాటి సిగ్నల్స్‌ను ఏ కేబుల్‌ ఆపరేటరూ తొలగించకూడదని ట్రాయ్‌ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దృష్ట్యా ట్రాయ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఈ చానళ్ల ప్రసారాలను ఎందుకు నిలిపివేశారో ఆగస్టు 11, 2014లోపు తెలపాలని కోరింది.