గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (15:29 IST)

చిత్ర పరిశ్రమ ఆ 4 కుటుంబాల చేతిలో.. మరి తెలంగాణ ఎవరిచేతిలో ఉందో?

చిత్ర పరిశ్రమ ఆ నాలుగు కుటుంబాల చేతిలోనే ఉందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేస్తున్న వాదనను టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఆ నాలుగు కుటుంబాలదే పెత్తనం అయితే తెలంగాణా రాష్ట్రంలో ఎవరి పెత్తనముందో తొలుత ఆయన తెలుసుకోవాలని సూచించారు. 
 
కాగా, తెలంగాణ జేఏసీ ప్రతినిధులు ఆ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను గురువారం కలిసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై జేఏసీ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు వివరించారు. 
 
ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న చిత్రపరిశ్రమ కొందరి వ్యక్తుల చేతుల్లో నడవడం సబబుకాదన్నారు. కేవలం పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు మాత్రమే వృద్ధి చెందితే సరిపోదు, చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు కూడా వృద్ధి చెందాలని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, ఈ విధానాన్ని సవరించాల్సిన అనసరం ఉందని మంత్రిగారిని కోరినట్టు కోదండరాం తెలిపారు.
 
టికెట్ల ఆధారంగానే పన్నులు వసూలు చేయాలన్నారు. చిత్ర పరిశ్రమలో కార్పొరేట్ గుత్తాధిపత్యం పోవాలన్నారు. ఒక ప్రత్యేక కమిటీని వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిత్రాలకు, తెలంగాణ కళాకారులతో నిర్మించిన చిత్రాలకు పన్ను రాయితీ కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర  అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమకు అనుకూల ప్రకటన చేయాలని కోదండరాం కోరారు.