గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (13:13 IST)

మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం : జగ్గారెడ్డి

మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ స్థానం నుంచి పోటీ చేయనున్న టి జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీలో చేరారు. ఆ వెంటనే ఆయన పేరును మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను మొదట బీజేపీ కార్యకర్తనే అని, సొంతింటికి వచ్చినట్టుగా ఉందని ఆయన తెలిపారు. 
 
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జగ్గారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల కన్నా ఉప ఎన్నికలంటేనే ప్రేమ అని వ్యాఖ్యానించారు. మెదక్‌ లోక్‌సభలో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు భారీగా నిధులు తీసుకువస్తానని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. 
 
కాగా, జగ్గారెడ్డి అభ్యర్థిత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెను సవాల్‌గా మారింది. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయనకు పట్టుంది. దీనికి తోడుగా బీజేపీ బలం, టీడీపీ సహకారం, పవన్ కళ్యాణ్ ఛరిష్మా తోడైతే.. జగ్గారెడ్డి గెలుస్తారని కమలదళం భావిస్తోంది. దీంతో జగ్గారెడ్డి ఇలాకాలో కేసీఆర్‌కు సవాలేనని అంటున్నారు.