గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (10:00 IST)

ఓటమికి కారణాలు వెల్లడించిన నటి జయసుధ!

గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి గల కారణాలను సికింద్రాబాద్ శాసనసభ్యురాలు, సినీ నటి జయసుధ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోని స్థానిక నేతల విభేదాల వల్లే తాను ఓటమి పాలయ్యానని వ్యాఖ్యానించారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యవజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా యూత్ కాంగ్రెస్‌కు ఎన్నికలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయసుధ పోటీ చేసి తొలిసారే గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు.
 
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై విజయం సాధించిన జయసుధ, తర్వాత నగర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా కష్టపడి పని చేసే వారికి గుర్తింపు లేదని ఆమె చెప్పారు. డబ్బులు ఉన్న వారికే పార్టీలో ప్రాధాన్యత లభిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సొంత పార్టీ నేతల వ్యవహార శైలే కారణమన్నారు.