శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (20:57 IST)

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కేడర్ డిమాండ్

స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉంది. ఆయన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉంది. ఆయన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. ఇకపోతే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ఉన్నారు. అయితే, ఏపీలో టీడీపీ అధికారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడుగా యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను చేయాలంటూ ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అదీ కూడా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే. దీంతో చంద్రబాబుతో పార్టీ ఇతర నేతలు కూడా ఒకింత షాక్‌‍కు గురయ్యారు. 
 
బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ముందే కార్యకర్తలు ఈ తరహా నినాదాలు చేశారు. టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని, తెలంగాణలో టీఆర్ఎస్‌తో పాటు బీజేపీతో కూడా టీడీపీ పొత్తు పెట్టుకోవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. 
 
దీంతో చంద్రబాబు స్వయంగా కార్యకర్తలను సముదాయించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తులు ఉంటాయని వారికి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఇకపోతే పార్టీ అధ్యక్ష పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించే అంశంపై మాత్రం చంద్రబాబు నోరుమెదపలేదు.