శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (12:18 IST)

తెలంగాణ జూడాలకు హైకోర్టు 48 గంటల డెడ్‌లైన్!!

గత కొన్ని రోజుల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం విదితమే. అయితే జూడాల సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూడాల సమ్మె చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను 48 గంటల్లోగా విరమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. 
 
తెలంగాణలో 50 రోజులకు పైగా జరుగుతున్న జూడాల సమ్మెపై బుధవారం ఉదయం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ప్రజారోగ్య సేవలకు ఇబ్బంది కలిగిస్తున్న జూడాల సమ్మెను అదుపు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ సేవల అంశం మినహా మిగిలిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించి, జూడాలు సమ్మెను విరమించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. 48 గంటల్లోగా జూడాలతో సమ్మెను విరమింపజేయాలని ఆదేశించింది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 
 
కాగా, వైద్య విద్యలో భాగంగా ఏడాదిపాటు గ్రామీణ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. అందుకోసం జీవో 107 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై ఆగ్రహించిన జూనియర్ డాక్టర్లు అక్టోబరు 1వ తేదీ నుంచి సమ్మె బాట పట్టారు.అప్పటి నుంచి జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేయడంతో.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.