గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (14:48 IST)

ప్రజాప్రతినిధులను వేధిస్తున్న కేసీఆర్ సర్కారు : కె జానారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం టీ ప్రజాప్రతినిధులను వేధిస్తోందని శాసనసభ విపక్ష నేత కె.జానారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకుగాను జానారెడ్డి (కాంగ్రెస్), ఆర్. కృష్ణయ్య (టీడీపీ), ఎర్రబెల్లి దయాకర్ రావు (టీడీపీ... సభకు రాలేదు) మినహా మిగిలిన విపక్ష సభ్యులందరినీ ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన విషయంతెల్సిందే. 
 
ఈ చర్యకు నిరసనగా జానారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ జరగని దురదృష్టకర సంఘటన ఇపుడు చోటుచేసుకుందన్నారు. శాసనసభ నుంచి సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై చర్చించాలని కోరిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
 
ప్రజాప్రతినిధులను వేధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే ప్రకటన ఏదీ చేయకపోగా.. విపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. రైతు సమస్యలపై విపక్షాల సూచనలు ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని... వెంటనే రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.