శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (09:18 IST)

రైతు రుణమాఫీతో మాకు దూలతీరుతోంది.. : తెలంగాణ మంత్రి కేటీఆర్

రైతు రుణమాఫీతో తమకు దూలతీరుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అంటున్నారు. రుణమాఫీ అమలు చేయడం తలకు మించిన భారంగా మారిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రుణభారాన్ని ప్రభుత్వం మోయాల్సి వస్తోందన్నారు. పైగా ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అందువల్లే ఒకేసారి నిధులను విడుదల చేయలేక దశలవారీగా బ్యాంకులకు నిధులు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే మాఫీ అమలు ప్రభుత్వానికి తలకుమించిన భారమైందని ఆయన చెప్పుకొచ్చారు.
 
మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం, కిషన్ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రైతు తన గోడును మంత్రి వద్ద వెళ్లబోసుకున్నారు. రుణమాఫీ పూర్తయిందని.. రైతులపై ఎలాంటి భారం లేదని సర్కారు చెబుతోందని, కానీ ఇందులో రవ్వంత నిజం కూడా లేదన్నారు. బ్యాంకులకు నాలుగు విడతల్లో రుణమాఫీ నిధులు విడుదల చేయడం వల్ల తమపై వడ్డీ భారం పడుతోందన్నది అనేక మంది రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. 
 
‘రుణమాఫీని ఒక్కసారిగా అమలు చేస్తే బాగుండేది. నాలుగు వాయిదాల్లో అమలు చేయడం వల్ల మిగిలిన రుణమొత్తానికి వడ్డీ రైతులపై పడుతోంది’ రైతు అనగా... వడ్డీని ప్రభుత్వమే కడుతోందని మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. దీనికి రైతులు ముక్తకంఠంతో ‘కానే కాదు. ఆ భారం రైతులపైనే పడుతోంది’ అని స్పష్టంచేశారు. 
 
ఈ సమయంలోనే కేటీఆర్ రుణమాఫీపై ప్రభుత్వం కష్టాన్ని వ్యక్తం చేశారు. మాఫీ అమలు ప్రభుత్వానికి తలకుమించిన భారమైందన్నారు. ప్రభుత్వం దగ్గర పైసలుంటే ఒక్కసారే మాఫీ అమలు చేసే వాళ్లమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాఫీ అమలు చేయడానికి తల ప్రాణం తోకకొస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.