శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 24 నవంబరు 2015 (14:21 IST)

కల్వకుంట్ల కవిత వాక్కు... వార్ వన్ సైడే... తెరాస రికార్డు: కాంగ్రెస్, భాజపా డిపాజిట్లు గల్లంతు

కేసీఆర్ కుమార్తె, తెరాస ఎంపీ కవిత చెప్పినట్లు వరంగల్ వార్ వన్ సైడే జరిగింది. వరంగల్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఏకపక్షంగా మద్దతు పలికారు. కాంగ్రెస్, భాజపా-తెదేపా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు డిపాజిట్లు గల్లంతయ్యాయి. అసలు సమీప భవిష్యత్తులో అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలు బతికి బట్టకట్టే పరిస్థితే కనబడలేదు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల ప్రసంగంలో తెరాస సర్కార్ తప్పు చేస్తే తమను శిక్షించాలనీ, ప్రతిపక్షాలు తమపై చేసే విమర్శలు అసత్యమైతే తమను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పిన మాటలకు వరంగల్ ప్రజలు భారీ మద్దతు తెలుపుతూ రికార్డు విజయాన్ని కట్టబెట్టారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని అంటున్నారు తెరాస నాయకులు.
 
తెరాస ఎంపీ అభ్యర్థి పి.దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం వైపు దూసుకెళ్లగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,315, పి.దేవయ్య 1,30,178 ఓట్లు, వైకాపా అభ్యర్థి ఎన్.సూర్యప్రకాష్ కేవలం 23, 325 ఓట్లు తెచ్చుకున్నా డిపాజిట్లు కోల్పోయారు. దీనితో తెలంగాణలో తెరాస పార్టీకి తిరుగులేదని తేలిపోయింది.