గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (16:18 IST)

పొన్నాల భూకబ్జాపై హౌస్ కమిటీ ఏర్పాటుకు సై : కేసీఆర్ వెల్లడి

తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భూకబ్జాలపై హౌస్ కమిటీ వేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. అసైన్డ్ భూములను పొన్నాల కొనుగోలు చేసిన అంశంపై తెలంగాణ సభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఇందులో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. పొన్నాల కొనుగోలు చేసిన అసైన్డ్ భూములతో పాటు.. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అసైన్డ్‌ భూముల కబ్జాపై సభా సంఘం వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. 
 
గత ప్రభుత్వమే పొన్నాల భూమిని రద్దు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 90 వేల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాలో ఉందని చెప్పారు. అంతకుముందు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని, ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పలేదని ఆరోపించారు. ఆ భూముల్లో ఫౌల్ట్రీ ఫామ్ను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.
 
నిబంధనలకు విరుద్ధంగా పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరాకు రూ.25,500లకే కేటాయించారని హరీష్రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ, విక్రయిచండ కాని చేయకూడదని ఆయన వెల్లడించారు.