బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (09:37 IST)

హైదరాబాద్‌ను వదలుకునివుంటే పుష్కర కాలం క్రితమే తెలంగాణ : కేసీఆర్

హైదరాబాద్‌ను వదులుకునివుంటే తెలంగాణ రాష్ట్రం పుష్కరకాలం కిందటే వచ్చివుండేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ, తాను అనుకున్నది సాధించేరకమని, అలాగే, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదుపై రాజీ లేదని తెగేసి చెప్పానని, అందువల్లే పదేళ్ళు ఆలస్యంగాణ వచ్చిందన్నారు. అంతేకాకుండా, ఆంధ్రా నేతలు హైదరాబాదును పొరుగు నగరంగానే చూశారని, అందువల్లే అనుమతి లేని కట్టడాల సంఖ్య ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దాల్సి వుందని, నగరాన్ని తీర్చిదిద్దుకునే దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు అలసత్వాన్ని వీడాలని ఆయన సూచించారు. 
 
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఎ, వాటర్‌ బోర్డు వంటి సంస్థలు తమ పనితీరు మెరుగుపరచుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అక్రమ నిర్మాణాల విషయంలో ఏ దారిలో వెళితే మేలు కలుగుతుందో ఆలోచించి ముందడుగు వేయాలని, భవిష్యత్తులో అటువంటి ప్రయత్నాలు జరగకుండా, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.