శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (06:17 IST)

నిరసనలు ఎలా చేస్తారో చూస్తా... ఇందిరా పార్కునే ఎత్తివేయిస్తున్న కేసీఆర్: చంద్రబాబుకే పాఠాలు

తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో కానీ ప్రజా నిరసనలకు వేదికగా నిలిచి చరిత్రకు సాక్షీభూతమై హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అతి త్వరలో కనుమరుగు కానుంది.

తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో కానీ ప్రజా నిరసనలకు వేదికగా నిలిచి చరిత్రకు సాక్షీభూతమై హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అతి త్వరలో కనుమరుగు కానుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నగరం మధ్యలో ఉన్న ధర్నా చౌక్‌ను నగర శివారుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా త్వరితగతిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. 
 
ఉమ్మడి ఏపీలో 2000 సంవత్సరం వరకు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే ఆందోళనలు జరిగేవి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్కడే నిరసన తెలిపేవారు. అయితే  చంద్రబాబు హయాంలో సచివాలయం వద్ద ధర్నాలు, ఆందోళనలు చేయకూడదంటూ ఆదేశించి మరోచోటుకు తరలించాలని పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో ఇందిరాపార్క్, ఎన్టీఆర్‌ స్టేడియం పరిసరాల్లో తమ అనుమతితో ధర్నాలు, నిరసనలు చేసుకోవచ్చని అప్పటి కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందిరాపార్క్‌–డీబీఆర్‌ మిల్స్‌ రోడ్‌ను ధర్నా చౌక్‌గా ఏర్పాటు చేశారు. ఉద్యమాలు, నిరసనలు అక్కడే జరిగేవి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా కొనసాగుతున్న ధర్నా చౌక్‌ ప్రస్థానం అతి త్వరలో ఇందిరా పార్క్‌ వద్ద ముగియనుంది.
 
సచివాలయం, అసెంబ్లీ, డీజీపీ.. ఇలా ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నీ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోనే ఉన్నాయి. ఈ పరిధిలోనే ధర్నాల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేలా నిరసనకారులు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేవారు. అయితే ఇక ఇందిరా పార్క్‌ నుంచి ధర్నా చౌక్‌ను తరలిస్తే ఎక్కడ పెడతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మియాపూర్, నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, సాగర్‌ రోడ్, రాజేంద్రనగర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 25 నుంచి 30 ఎకరాల్లో ధర్నా చౌక్‌ను విశాలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణ ఉద్యమ కాలంలో నిద్రలేస్తే చాలు ఇందిరా పార్క్ వద్దకు జనాలను తరలించి ధర్నాలు చేయించిన కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వివిధ ప్రజా బృందాలు చేస్తున్న నిరసనలను, ఆందోళనలను ఏమాత్రం సహించలేకపోతున్న నేపధ్యంలోనే హైదరాబాద్‌లో ఆందోళనలకు, ధర్నాలకు వేదికగా నిలిచిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ను నగరానికి దూరంగా తరలిస్తున్నాడని అనుమానాలు రేగుతున్నాయి. నగరం నడిబొడ్డున జనం నోరిప్పడానికి వీల్లేకుండా చేస్తున్న కేసీఆర్ కాఠిన్య పాలనను చూసి చంద్రబాబు సైతం పాఠాలు నేర్చుకోవలసిందేనని నెటిజన్లు వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు.