గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జులై 2016 (13:38 IST)

కోతుల జాగను పొల్లుపొల్లు చేసినం.. అందుకే అవి మనల్ని పొల్లుపొల్లు చేస్తున్నాయ్.. కేసీఆర్

నల్గొండ జిల్లాలో కోతులు వీరంగంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ జిల్లాలో కోతుల బెడద అధికంగా ఉందంటూ స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వెళ్లాయి.

నల్గొండ జిల్లాలో కోతులు వీరంగంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ జిల్లాలో కోతుల బెడద అధికంగా ఉందంటూ స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వెళ్లాయి. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లింది.
 
ఈ పరిస్థితుల్లో శుక్రవారం నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో హరితహారంలో భాగంగా కేసీఆర్ మొక్కను నాటారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కోతుల బెడదను ప్రధానంగా స్పందించారు. 'కోతి అంటే అంజన్న కాబట్టి మనం వాటిని చంపం.. అవేమో హంగామా చేస్తున్నాయి..' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘కోతులు మ‌న ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌స్తున్నాయి..? మ‌నం కోతుల జాగను పొల్లుపొల్లు చేసినం కాబట్టి.. అవి మనల్ని పొల్లుపొల్లు చేస్తున్నాయి..’ అని ఆయ‌న పేర్కొన్నారు.
 
రెండు వారాల పాటు 24 గంటలు మ‌న‌కు చెట్లు పంచ‌డ‌మే ప‌ని కావాల‌ని కేసీఆర్ అన్నారు. అడ‌వుల శాతాన్ని పెంచితే మ‌ళ్లీ కోతులు అక్క‌డ‌కు వెళ్లిపోతాయ‌ని ఆయ‌న సూచించారు. చెట్టును పెంచడమంటే మనల్ని మనం బాగు చేసుకోవడమేన‌న్నారు. 'వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘ప్రతీ పాఠశాల ఆకుప‌చ్చ ఒడి కావాలె’ అని ఆయ‌న ఆకాంక్షించారు. ‘అడ్డగోలుగా వనాలని నాశనం చేసినందుకే మనకు వానలు లేకుండా పోతున్నాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా, క‌వులు క‌విత‌లు రాయండి.. గాయ‌కులు గ‌ళాలు విప్పండి.. చెట్ల పెంప‌కంపై ప్ర‌చారం చేయండి’ అంటూ ఆయన కళాకారులకు పిలుపునిచ్చారు. హ‌రితహారంలో రాష్ట్రంలోని ప్ర‌తీ ఒక్క‌రూ పాల్గొనాల‌ని కోరారు. క‌ళాకారులు ప్ర‌జ‌ల్లోకి ఈ ప‌థ‌కాన్ని తీసుకెళ్లాల‌ని ఆయ‌న కోరారు. మాన‌వ జాతికి ఉప‌యోగ‌ప‌డే వ‌నాల ప్రాధాన్య‌తను చాటి చెప్పాలని పేర్కొన్నారు. ‘మ‌నం ఎంత‌గా చెట్ల‌ను పెంచితే అంత‌గా వ‌ర్షం వ‌స్తుంది’ అని ఆయ‌న అన్నారు. ల‌క్ష మందితో ఒకే స‌మ‌యంలో 1.25 ల‌క్ష‌ల మొక్క‌లు నాట‌డం పెద్ద సాహసమేన‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సాహ‌సాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు చేప‌డుతున్నార‌ని ఆయ‌న కొనియాడారు.