శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:42 IST)

గోదారి పుష్కరాలంటే మనం కూడా సన్నాసుల్లా వెళ్లి అక్కడ గుండు కొట్టించుకుంటాం... కేసీఆర్ సెటైర్స్

తెరాస ప్లీనరీలో 8వ సారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్, తెరాస సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టారు. ఇంకా బంగారు తెలంగాణ కోసం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయంటూ కార్యకర్తలనుద్దేశించి నుడివారు. మధ్యలో మరోసారి ఆంధ్ర పాలకుల గురించి చలోక్తులు విసిరారు. పుష్కరాల గురించి మాట్లాడుతూ... గోదావరి, కృష్ణా పుష్కరాలు అని చెబితే తెలంగాణ నుంచి మనం కూడా సన్నాసుల్లా వెళ్లి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దనో, గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి దగ్గరకో వెళ్లి గుండు కొట్టించుకుంటామని సెటైర్లు విసిరారు. 
 
గోదావరి నది వందల కిలోమీటర్లు తెలంగాణలో పయనించి కేవలం 60 కిలో మీటర్ల లోపే ఆంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తుందనీ, అలాంటిది పుష్కరాలు వారు నిర్వహించడమేమిటో తనకు అర్థం కాదన్నారు. వందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించే గోదావరి నది ఒడ్డున బాసర సరస్వతి దేవి ఆలయం, కాళేశ్వరంలో మహేశ్వరుని ఆలయం, మంధనిలో గౌతమేశ్వర స్వామి ఆలయంతోపాటు రాముడు, సరస్వతి దేవాలయాలున్నాయనీ, కావలసిస్తే అక్కడ పుష్కర స్నానం చేసి గుండు కొట్టించుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా తెలంగాణ నాయీబ్రాహ్మణులకు పని దొరుకుతుందని చెప్పుకొచ్చారు.
 
ప్లీనరీ భోజన విరామం సమయంలో మంత్రులు వేణుగోపాలాచారి, తుమ్మల నాగేశ్వర రావులతో కలిసి కేసీఆర్ తెలంగాణ వంట రుచులను చూశారు. అనంతరం కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు.