శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (17:46 IST)

చీప్ లిక్కర్ తెచ్చేది ప్రజల సంక్షేమం కోసమే : తెలంగాణ సీఎం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందుబాటులో ఉన్న గుడుంబా వల్ల అనేక కుటుంబాలు నాశనమైపోతున్నాయని, అందువల్ల వీరిని ఆదుకునేందుకే చీప్ లిక్కర్‌ను తీసుకునిరానున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ 'గుడుంబాను అరికట్టడానికే చీప్ లిక్కర్'ను తెస్తున్నామంటూ స్పష్టం చేశారు. పైగా తాము ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పారు. 
 
చీప్ లిక్కర్‌పై రాద్ధాంతం చేస్తున్న విపక్ష నేతలు గుడుంబాను ఎలా అరికట్టాలో మాత్రం చెప్పరని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతున్నప్పటికీ... ప్రజల శ్రేయస్సు కోసమే చీప్ లిక్కర్‌‌ను తెస్తున్నామని తెలిపారు. అలాగే, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. దీనిపై గట్టి కసరత్తు జరుగుతోందని... కొంత జాప్యం జరిగినా ఈ విద్యావిధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. 
 
అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొందరు నేతలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని, కొన్ని పత్రికలు కూడా ఈ విషయంపై పనిగట్టుకుని వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని... అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్‌ను కూడా రూపొందించుకున్నామని కేసీఆర్ చెప్పారు.