గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (09:13 IST)

కేసీఆర్ మాటతీరుపై కేంద్రానికి నిఘా నివేదికలు : కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట తీరు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేంద్రంతోనూ, ఇటు పొరుగు రాష్ట్రాలతోనూ కేసీఆర్ సఖ్యతగా ఉండటం లేదని అందువల్ల తీరని నష్టం వాటిల్లుతుందే గానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సఖ్యతతో ఉండకపోగా... నోటి దురుసుతో వ్యవహరిస్తోందని... ఇలాగైతే ఎలా? అని మండిపడ్డారు. సాక్షాత్తు ప్రధానమంత్రినే సన్నాసి, కొత్త బిచ్చగాడు, ఫాసిస్ట్ అంటూ కామెంట్ చేసిన ఘనత కేసీఆర్‌ది అని... ఈ సమాచారం అంతా ఢిల్లీకి వెళ్లదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్క వ్యవహారం ఇంటలిజెన్స్ ద్వారా కేంద్రానికి వెళుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీలను నిర్భయంగా కలిశామని... ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలితో ఎవరినీ కలవలేని పరిస్థితి తలెత్తిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్‌ను వ్యక్తిగా ఆహ్వానించారే తప్ప... అధికారికంగా ఆహ్వానించలేదని... ఇలాంటి పొరపాట్లన్నీ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తాయని కేసీఆర్ కు హితవు పలికారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.