గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (11:59 IST)

పొన్నాల మగాడా.. కోర్టుకెళ్లే దమ్మూధైర్యం ఉందా : కేటీఆర్ ప్రశ్న!

తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కె తారక రామారావు మరోమారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన చట్ట విరుద్ధంగా ఉందనీ కోర్టుకు వెళతామంటూ పొన్నాల చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'ప్రజాకోర్టు తీర్పును కాదని ఈ మొగోడు (పొన్నాల) సుప్రీంకోర్టు, హైకోర్టుకు పోతాడంట... ముందు నీకంటుకున్న మురికి కడుక్కో. ఏడు నెలల పసిగుడ్డు తెలంగాణ. అయినా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకాని ప్రజాసంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చట్టవిరుద్ధం అంటూ ఈ మొగోడు కోర్టులకు వెళతాడట' అని పొన్నాలపై నిప్పులు చెరిగారు. 
 
ముందు మీపై, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి తదితరులపై ఉన్న కేసుల్ని చూసుకోండని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు పొన్నాలకు లేదని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుని పోయిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.