గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (15:28 IST)

ఇష్టమున్నా లేకున్నా కలిసి పని చేయాల్సిందే : కేసీఆర్‌ సమక్షంలో ప్రణబ్ ముఖర్జీ

చీటికిమాటికీ గొడవలు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనదైనశైలిలో చురకలు అంటించారు. ఈ చురకలు కూడా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలోనే అంటించడం గమనార్హం. 
 
మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు రచించిన ఉనికి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అంశంతో తనకు సంబంధం ఉందని.... కానీ ఆ విషయాలేవీ బహిర్గతం చెప్పలేనన్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఇష్టమున్నా లేకున్నా పొరుగు రాష్ట్రాలతో కలిసి వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. మాజీ ప్రధాని వాజ్‌పాయి పార్లమెంట్ విలువలు కాపాడారు. ప్రజాప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి. పొరుగు వారితో కలిసిమెలిసి జీవించాలన్నారు. 
 
అలాగే, హైదరాబాద్ తెలంగాణకు రాజధాని మాత్రమే కాదని, దేశంలోని ఓ ముఖ్యపట్టణమన్నారు. హైదరాబాద్ ఓ గొప్ప నగరం, దేశానికి చాలా ముఖ్యమైన ప్రాంతమన్నారు. ముఖ్యంగా మతసామరస్యానికి ప్రతీక అన్నారు. ఈ నగరం అంటే దేశ ప్రజలందరికీ ఎంతో ఇష్టం.. నాకు కూడా అని చెప్పారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా ఐటీ, విద్యారంగానికి హబ్‌గా నిలిచింది గుర్తు చేశారు. నగరానికున్న ప్రాముఖ్యత, స్నేహపూర్వక వాతావరణం చెడకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే అని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. 

కాగా, హైదరాబాద్‌లోని హైచ్‌ఐసీసీలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు రచించిన ఉనికి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకం మొదటి ప్రతిని రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. ఉనికి పుస్తకం రచించిన విద్యాసాగర్‌రావుకు నా అభినందనలు. పుస్తకావిష్కరణకు నన్ను పిలవడం ఆనందంగా ఉంది. విద్యాసాగర్‌రావు పార్లమెంట్ సభ్యుడైనప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఉనికి పుస్తకం తొలికాపీని నాకు అందించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.