గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (11:37 IST)

హల్లో నరసింహన్.. మీ చర్యలు సుప్రీం తీర్పులకు విరుద్ధం.. కేసు వేస్తా : మర్రి శశిధర్ లేఖ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ వైఖరిని టీ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తెరాస ప్రభుత్వ రాజ్యాంగేతర చర్యలకు గవర్నర్‌ కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు. గవర్నర్‌ వ్యవహార శైలిని నిశితంగా విమర్శిస్తూ... నేరుగా నరసింహన్‌కే తాజాగా ఓ లేఖ రాశారు. 
 
ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తెరాస కేబినెట్‌లో మంత్రిగా కొనసాగిస్తుండటంపై ఆయన మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే. కానీ... తలసాని చేత టీఆర్‌ఎస్‌ పార్టీ నడుపుతున్న ప్రభుత్వంలో మంత్రిగా మీరు ప్రమాణస్వీకారం చేయించారు అంటూ గవర్నర్‌ వైఖరిని తప్పుబట్టారు. 
 
ఈ చర్య ద్వారా రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పేరాగ్రాఫ్‌ (2)(ఎ)ను తలసానితోపాటు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఉల్లంఘించినట్లయిందని తెలిపారు. ‘గవర్నర్‌గా మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్నారు. రాజ్యాంగ గౌరవాన్ని, విధులను కాపాడాల్సింది మీరే. రాజ్యాంగం మీకు అన్ని అధికారాలను ఇచ్చినప్పటికీ, మీరు మీ విధి నిర్వహణలో విఫలమయ్యారని తెలిపేందుకు చింతిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా రాజేందర్‌ సింగ్‌ రాణా వెర్సస్‌ స్వామి ప్రసాద్‌ మౌర్య కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును మర్రి గుర్తుచేశారు. ఈ తీర్పులోని 44వ పేరా ప్రకారం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పార్టీ ఫిరాయింపు కింద తప్పు చేసినట్లేనని, ఆయనపై అనర్హత విధించాలని తెలిపారు. ‘పార్టీ ఫిరాయింపు’ వర్తించే రోజు నుంచే తలసానిపై అనర్హత కూడా వర్తిస్తుందన్నారు. కానీ, ఆయన ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ధిక్కరిస్తూ పదవిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. 
 
‘గవర్నర్‌ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిపై అమర్యాదకరమైన పదజాలం వాడకుండా... గౌరవం, మర్యాదతోపాటు నా కుటుంబ నేపథ్యం నన్ను అడ్డుకుంటోంది’ అని మర్రి తన లేఖలో పేర్కొన్నారు. అలా అంటూనే... ‘పదవిని పట్టుకుని వేలాడాలనే అత్యాశే మీ నిష్క్రియా పరత్వానికి కారణమని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నా బాధ్యతగా భావించి మీకు ఈ లేఖ రాస్తున్నాను’ అని మర్రి సూటిగా చెప్పారు. 
 
‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో విపక్షాన్ని తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తోంది. అనైతిక, నీతిరహిత విధానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఇందులో మీరు కూడా భాగస్వామి అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కళంకిత ముద్రతో ఇంకా గవర్నర్‌ పదవిలో ఉండాలా.. లేదా అనే నిర్ణయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అని మర్రి శశిధర్‌ రెడ్డి సూటిగా చెప్పారు. 
 
ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీపైనా కోర్టులో రిట్‌ వేయవచ్చు. దీని మేరకు మీరు రాజ్యాంగ పదవిలో ఉండకూడదు అని తెలిపారు. ‘వీటన్నింటి నేపథ్యంలో మీకు మీ విధులను గుర్తు చేయాల్సి వస్తోంది. తగిన చర్యలు తీసుకుని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించండి. లేనిపక్షంలో మీ విధులను, బాధ్యతలను మీకు గుర్తు చేసేందుకు రాజ్యాంగపరమైన నిబంధనల మేరకు చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడను’ అంటూ మర్రి శశిధర్‌ రెడ్డి తన లేఖలో పేర్కొనడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.