శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (11:52 IST)

మెట్రో రైలు బిడ్ రాష్ట్రం విడిపోదనే దక్కించుకున్నాం.. కానీ : ఎల్&టి ఛైర్మన్

హైదరాబాద్ మెట్రో రైల్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విడిపోదన్న గట్టి నమ్మకంతోనే తాము బిడ్ దాఖలు చేసి దాన్ని దక్కించుకున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ వీబీ గాడ్గిల్ చెప్పారు. అంతేకాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో రైలు నిర్మాణ పనులు తాము చేపట్టలేమంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీకి 20 పేజీలతో కూడా ఘాటైన లేఖాస్త్రాన్ని సంధించారు. 
 
గాడ్గిల్ తన లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తారని, హైదరాబాద్‌ స్థాయి మారుతుందని తాము ఊహించలేదు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగినా అప్పట్లో ఏమీ జరగలేదు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కుదిరిన తర్వాత.... 2010 డిసెంబర్‌ 30వ తేదీన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించింది. కమిటీ ఆరు పరిష్కార మార్గాలు సూచించింది. వాటిలో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్నది కూడా ఒకటి. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్‌కు కేంద్రపాలిత ప్రాంతం హోదా కల్పించి, దీన్ని ఉమ్మడి రాజధాని చేస్తారని అప్పట్లో అందరూ అన్నారు. అందువల్ల రాష్ట్రం విడిపోయినా ప్రాజెక్టుకు ఇబ్బంది ఉండదని, హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని భావించే ఈ బిడ్‌కు మా సంస్థ ముందుకొచ్చింది. 
 
అయితే, 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకునే తాము మెట్రో ప్రాజెక్టు చేపట్టాం. కానీ... విభజన జరిగిపోయిందని, హైదరాబాద్‌ ప్రాధాన్యం తగ్గిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, హైదరాబాద్‌ నగరానికి ఉన్న ప్రాధాన్యం, దీని ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ప్రాధాన్యాలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మేం మెట్రో రైలు ప్రాజెక్టుకు బిడ్‌ వేశాం. హైదరాబాద్‌ నగరానికి అంతకుముందున్న స్థాయిలోనే ప్రాధాన్యం ఉంటే ప్రాజెక్టు మనుగడ కూడా బాగుండేది. ఎందుకంటే, ప్రాజెక్టు ఆదాయ మార్గాల్లో రియల్‌ ఎస్టేట్‌ కూడా చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రాజెక్టు మనుగడ సాధించడం సాధ్యం కాదని ఇంతకుముందు కూడా మేం పలు సందర్భాలలో చెప్పాం. ఈ ప్రాజెక్టు కేవలం రైలు రవాణా వ్యవస్థ మాత్రమే కాదు... పలు అంశాల సమాహారం. 
 
హైదరాబాద్‌ నగరానికి ఉన్న అవకాశాలను తాము తక్కువచేసి చూస్తున్నామని, ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని హెచ్‌ఎంఆర్‌ చేసిన అభిప్రాయాలు సరి కాదు. హైదరాబాద్‌ నగరం పదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని అవుతుందని గుర్తు చేశారు. ‘పదేళ్ల తర్వాత హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాదు. కేంద్ర పాలిత ప్రాంతమూ కాదు. వీటిలో ఏది జరిగినప్పటికీ... హైదరాబాద్‌కు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి ఉండే వనరులు యథాతథంగా ఉండేవి. విభజన తర్వాత హైదరాబాద్‌లో అవకాశాలు తగ్గాయి. ‘అప్పుడు హైదరాబాద్‌ మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రాజధాని. సమైక్య రాష్ట్రం అనేక జిల్లాలు, ఓడరేవులకు నిలయం. 
 
ఇప్పుడు హైదరాబాద్‌ వనరులు అంతగా లేని చిన్న రాష్ట్రానికి రాజధాని. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కావల్సిన ఆర్థిక సాయం అందజేస్తుంది. పైగా, పార్లమెంటులో తెలంగాణ ఎంపీల బలం కూడా తగ్గుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేటురంగం నుంచిగానీ పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్‌ స్థాయి మారిపోయింది. తత్ఫలితంగా, ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ నుంచి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పడిపోతుంది. హైదరాబాద్‌ స్థితిగతులు మారిపోవడం వల్ల మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థిక మనుగడపై ప్రతికూల ప్రభావం పడింది అని గాడ్గిల్ తన లేఖలో పేర్కొన్నారు. 
 
ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వమే టేకోవర్‌ చేయాలన్నదే తమ అభిప్రాయం. కీలక దశకు చేరిన మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రజలకు అవసరం. ‘కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ తిరిగి అప్పగించి... ఈ ప్రాజెక్టును ప్రభుత్వమే టేకోవర్‌ చేసుకోవాలి. ఈ విషయంలో మేం లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు మేం సిద్ధం అని గాడ్గిల్ తన లేఖాస్త్రంలో పేర్కొన్నారు. తగిన తేదీ నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా చర్చలకు రావాలని ఎన్వీఎస్‌ రెడ్డిని కోరారు. తాము ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే ఈ ప్రతిపాదన చేస్తున్నామని తెలిపారు.