గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:38 IST)

వరంగల్‌లో వావివరుసలు విస్మరించిన ఇద్దరు యువకులు!

వరంగల్ జిల్లా గూడూరు మండలం, బొద్దుగొండ శివారు గుడి తాండాలో ఇద్దరు యువకులు వావి వరుసలు విస్మరించారు. వరుసకు సోదరి అయిన 13 యేళ్ల బాలికను బలవంతంగా అడవి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఇద్దరు కామాంధుల చెర నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువతి... తాండా వాసుల సహకారంతో బయటపడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... సోదరి వరసయ్యే బాలికపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి ప్రయత్నించారు. గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు గుడి తండాకు చెందిన దంపతులకు 13 ఏళ్ళ కుమార్తె ఉంది. నిరక్షరాస్యురాలైన బాలిక పశువుల కాపరిగా ఉంటోంది. పశువులను అడవిలో మేత నిమిత్తం మరో కాపరికి అప్పగించేందుకు తోలుకెళ్లింది. ఇంతలో, అదే తండాకు చెందిన ఇద్దరు యువకులు (ఆమెకు వరుసకు సోదరులు) అడవిలో కాపుకాచి ఆమె నోరు మూసి ఎత్తుకెళ్లారు. 
 
భయభ్రాంతులకు గురి చేశారు. వివస్త్రను చేసి బెదిరించారు. ఎలాగో వారి బారి నుంచి తప్పించుకున్న యువతి తండాలోకి పరుగుతీసింది. దీనిని గమనించిన మహిళలు బాలికకు చీరకప్పి, విషయం తెలుసుకున్నారు. అనంతరం, బాలిక తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కామాంధులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.