శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 14 మార్చి 2016 (09:22 IST)

మిషన్‌ భగీరథను ఖచ్చితంగా పూర్తి చేసితీరుతాం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మిషన్‌ భగీరథ'ను ఖచ్చితంగా పూర్తి చేసి, తెలంగాణ ప్రజలకు నీరందిస్తామని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ప్రాజెక్టులను సమైక్య రాష్ట్రంలో ఒక ఎత్తుగడతో అడ్డుకున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ 'అంతర్‌ రాష్ట్ర వివాదాల్లో ఇరికించడం తొలి ఎత్తుగడ. లోయర్‌ పెన్‌గంగను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదు. ఒక వేళ అంతర్రాష్ట్ర వివాదాల్లో ఉంటే మరింత జఠిలం చేయడం రెండు ఎత్తుగడ. అప్పులు తెస్తున్నారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. 
 
ప్రణాళిక అనుగుణంగా నిధుల సమకూర్పుపై ఆలోచిస్తున్నాం. ఈ క్రమంలోనే బడ్జెట్‌ రూపకల్పన ఉంటుంది. ఎస్‌ఎల్‌బీసీ పనులు అడ్డుకున్నారు. వైఎస్‌ సాయుధ పోలీసులను పెట్టి పులిచింతల నిర్మించారు. తెదేపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాలతో వ్యతిరేక భావజాలాన్ని పెంచారు. తెరాస ప్రభుత్వ పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణ ఏర్పరిచింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటామని మహారాష్ట్రతో చెప్పాం. మీరు బతకండి.. మమ్మల్ని బతకనివ్వండని చెప్పి చర్చలు మొదలుపెట్టాం. 35 ఏళ్లలో తొలిసారిగా సింగూరు ఎండిపోయింది. ఈ ఏడాది ఎస్‌ఆర్‌ఎస్‌పీకి చుక్కనీరు రాలేదని గుర్తు చేశారు. 
 
మేడిగడ్డ నుంచి 1,400 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోయాయి. ఎగువ రాష్ట్రాల్లో 400 బ్యారేజీలు నిర్మాణం చేశారు. గత పాలకుల చర్యల వల్ల రాష్ట్రానికి ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే దిక్కుగా మిగిలాయి. నిజాంసాగర్‌, నిండితీరాలి ఎస్‌ఆర్‌ఎస్‌పీ నిండాలి. కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాలను సస్యశ్యామలం చేసేలా చర్యలు చేపట్టాం. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఇంటర్‌ స్టేట్‌ కంట్రోల్‌ బోర్డు ఏర్పాటు చేశాం. ఈనెల 19న ఇంటర్‌ స్టేట్‌ కంట్రోల్‌ బోర్డు సమావేశం నిర్వహిస్తాం. లోయర్‌ పెన్‌గంగ, లెండి ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలుస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.