గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2015 (10:49 IST)

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.40 లక్షలు : హోంమంత్రి నాయిని

నల్గొండ జిల్లా సూర్యాపేటలో అర్థరాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, కానిస్టేబుళ్లను పరామర్శించిన తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు. 
 
దొంగల కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ లింగయ్య కుటుంబానికి రూ.40 లక్షల పరిహారాన్ని ప్రకటించిన నాయిని, హోంగార్డు మహేశ్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర ప్రయోజనాలను కూడా బాధిత కుటుంబాలకు అందిస్తామని నాయిని అందచజేశారు.
 
అంతకుముందు దోపిడీ దొంగల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ మొగులయ్యను నాయిని నర్సింహారెడ్డి పరామర్శించారు. ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు తెలిపాయి. అర్థరాత్రి సోదాలు చేస్తున్న పోలీసులపై మెరుపుదాడి చేసిన దోపిడీ దొంగలు ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన మొగులయ్య, మరో కానిస్టేబుల్‌ను హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. 
 
కాగా, మొగులయ్య శరీరంలోని ఒక బుల్లెట్, మరో కానిస్టేబుల్ శరీరంలోని ఒక బుల్లెట్‌ను వైద్యులు వెలికితీశారు. మొగులయ్య శరీరంలోని మరో రెండు బుల్లెట్లను వెలికితీసేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వారిద్దరికీ ప్రాణాపాయం తప్పిందని చెప్పారు.