శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (19:01 IST)

హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం వద్దు : టీ ఎంపీ వినోద్

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం వద్దనే వద్దని టీఆర్ఎస్ ఎంపీ బి వినోద్ కుమార్ మరోమారు స్పష్టం చేశారు. ఇదే అంశంపై హోం మంత్రి, ప్రధానమంత్రులతో సమావేశంకానున్నట్టు ఆయన బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. 
 
దీనిపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ హైదరాబాద్‌పై గవర్నర్‌కి అధికారాలు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కల్పించవద్దని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నట్టు వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు అందరూ రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంకా పరిష్కారం కాని కొన్ని అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్) భేటీ అయ్యారు. హైదరాబాదులోని సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ చేసిన సిఫార్సులను ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఆమోదించారు.