శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (13:00 IST)

మెదక్ లోక్‌సభ బై పోల్ : జైపాల్, రాజనర్సింహా, సర్వే పోటాపోటీ!

మెదక్ లోక్‌సభ స్థానానికి వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశమివ్వాలంటూ వారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను పదేపదే కోరుతున్నారు. వీరిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, కేంద్ర మాజీ మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణలు ఉన్నారు. 
 
వీరిలో జైపాల్ రెడ్డి, దామోదర రాజనర్సింహా పోటీకి సిద్ధమని అధిష్టానానికి సంకేతాలివ్వగా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా పోటీకి సై అంటున్నారు. మెదక్ లోక్‌సభకు పోటీ చేయమని అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సర్వే తెలిపారు. అధిష్టానం మాటను తు.చ తప్పకుండా పాటిస్తానని ప్రకటించారు. 
 
మరోవైపు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ధీటుగా ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ సర్వే చేస్తున్నట్టు సమాచారం. ఈ సర్వేలో పలువురు నేతలు టీఎన్జీవో నేత కోదండరాం పేరును వెల్లడించినట్టు సమాచారం. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి వుంది. 
 
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా, 27వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది.