బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (11:16 IST)

ఆ ముగ్గురు మినహా.. తెలంగాణ అసెంబ్లీ విపక్షసభ్యులంతా సస్పెండ్

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సోమవారం సభకు హాజరైన విపక్షసభ్యుల్లో ఇద్దరిని మినహా మిగిలిన విపక్ష సభ్యులందరినీ సభాపతి మధుసూదనాచారి మూకుమ్మడిగా సస్పెండ్ చేశారు. టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సభకు రాలేదు. దీంతో ఆయన సస్పెండ్ నుంచి తప్పించుకోగా, సభకు హాజరైనప్పటికీ.. టీ కాంగ్రెస్ సీనియర్ నేత, విపక్ష నేత కె జానారెడ్డిని, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యలను మాత్రం స్పీకర్ సస్పెండ్ చేయలేదు. అయినప్పటికీ... జనారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సభాసమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులంతా కలిసి రైతుల రుణమాఫీపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. రుణమాఫీ ఒకేసారి చేపట్టాలని డిమాండ్ చేశాయి. కానీ, స్పీకర్ మాత్రం ఈ వాయిదా తీర్మానాలన్నింటినీ తోసిపుచ్చారు. దీంతో సభ రైతు సమస్యలపై భగ్గుమంది. విపక్షాలన్నీ ఏకమై సభలో రైతు సమస్యలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నందుకుగాను సభ్యులను సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి టి హరీష్ రావు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో సభాపతి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ సభ్యులను ప్రభుత్వం సభ నుంచి సస్పెండ్ చేసింది. అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
 
స్పీకర్, సీఎం విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాలు సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని శాసనసభావ్యవహారాల మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో సభ్యలను సస్పెండ్ చేసినట్లు ఆయన సభకు వివరించారు. ఎంఐఎం మినహా విపక్ష సభ్యలందరూ సస్పెండ్ అయ్యారు. జానారెడ్డి, ఆర్.కృష్ణయ్య సభలో ఉన్నప్పటికీ ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయలేదు. అయినప్పటికీ జానారెడ్డి సభ నుంచి బయటకు వచ్చేశారు. సభ్యుల సస్పెన్షన్ సమయంలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సభలో లేరు.
 
సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ప్రముఖుల్లో.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌‌కుమార్, డికె. అరుణ, ఎన్.భాస్కర్‌రావు, మల్లు భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్, ఎ.గాంధీ, గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, సాయన్న, జేపీ వివేకానంద, కిషన్‌ రెడ్డి, కె.లక్ష్మణ్, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పి.వెంకటేశ్వర్లు, రవీంద్రకుమార్, సున్నం రాజయ్య, మాధవరెడ్డిలు ఉన్నారు.