శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (16:14 IST)

'నో బోరింగ్ బాబు' కథనాన్ని లైట్‌గా తీసుకోండి... అయినా విచారం వ్యక్తంచేస్తున్నాం : ఔట్‌లుక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్‌పై తాము వేసిన క్యారికేచర్, రాసిన కథనం పట్ల ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ ఔట్‌లుక్ విచారం వ్యక్తం చేసింది. ఆ క్యారికేచర్‌ లేదా కథనం ఏ ఒక్కరినీ ఉద్దేశించి వేయలేదని, ఆ కథనంలో ఎవరి పేర్లూ పేర్కొనలేదని ఆ పత్రిక గురువారం వివరణ ఇచ్చింది. అయితే, క్షమాపణ చెపుతున్నట్టు అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించక పోవడం గమనార్హం. 
 
ఈ పత్రిక తాజా సంచికలో వచ్చిన 'నో బోరింగ్ బాబు' కథనపై స్మితా సబర్వాల్ మండిపడిన విషయం తెల్సిందే. దీనిపై తనకు సారీ చెప్పాలంటూ ఆమె తన వ్యక్తిగత న్యాయవాదితో ఔట్‌లుక్‌ మ్యాగజైన్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆ మ్యాగజైన్ యాజమాన్యం స్పందించింది. 
 
'నో బోరింగ్ బాబు' కథనంలో తాము ఎవరి పేర్లూ పేర్కొనలేదని, అయినా తమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసులు పంపారంటూ కొన్ని వార్తా పత్రికలు, టీవీ న్యూస్ చానళ్లు, వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయని తెలిపింది. అయితే, మీడియాలో ఈ తరహా వార్తలు వచ్చి 36 గంటలు అయినా తమకెలాంటి లీగల్ నోటీసులు అందలేదని పేర్కొంది. పైగా.. సోషల్ మీడియాలో కూడా తమ పత్రిక కరస్పాండెంటుపై విమర్శలు చేస్తున్నారనీ, ఆమెపై దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. 
 
ఏది ఏమైనా.. తాము సర్వసాధారణంగానే కొన్ని సెటైర్లు రాస్తామని, అవి ఏ ఒక్కరినీ కించపరచాలన్న ఉద్దేశ్యం తమకు లేదని తెలిపింది. అందువల్ల ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవాలని కోరింది. అయితే, పరిస్థితి సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కథనం మొత్తం తీసేశామని, ఒకవేళ ఏదైనా తప్పు జరిగివున్నట్టయితే విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఔట్‌లుక్ మ్యాగజైన్ వివరణ ఇచ్చింది.