శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (15:54 IST)

కన్నపేగు అమ్మేస్తోంది... గిరిజన తండాల్లో దుస్థితి ఇదీ!

తెలంగాణ జిల్లాల్లోని అనేక గిరిజన తాండాల్లో శిశు విక్రయాల సంఖ్య యధేచ్చగా సాగుతూనే ఉంది. వాస్తవానికి పిల్లలు లేకు.. పిల్లలు కనిపించకుండా పోయిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్న సంఘటనలు అనేకం చూస్తుంటాం. కానీ, ఈ గిరిజన తాండాల్లో కన్నమమకారాన్ని విడిచి కొందరు పొత్తిళ్లలోనే పిల్లలనువిక్రయిస్తున్నారు. తాజాగా పండంటి కవలలకు జన్మనిచ్చిన ఓ తల్లి ఒక శిశువును విక్రయించిన ఘటన మెదక్ జిల్లా రూరల్ మండలంలోని ఔరంగాబాద్‌ తండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
తండాకు చెందిన ననావత్‌ దశరథ్‌, విన్నాలకు ఏడేళ్ల లోపు వయసు గల ఇద్దరు మగ సంతానం ఉన్నారు. ఆడపిల్ల కావాలనుకున్నారు. ఈ క్రమంలో విన్నా మళ్లీ గర్భిణికావడంతో ఈ నెల 17న పట్టణంలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో చేర్చారు. విన్నాకు కవల పిల్లలు జన్మించారు. కవలల్లో అడ, మగ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మగ సంతానం ఉండడంతో మరో మగ సంతానాన్ని పెంచడానికి వారి మనస్సు సమ్మతించలేదు. దీంతో ఎవరికైన విక్రయించాలన్న ఆలోచనకు వచ్చారు. 
 
కాన్పు రోజు నుంచే మగ శిశువును విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రి బిల్లుతో  పాటు మరికొంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించడంతో దశరథ్‌, విన్నాలు సదురు వ్యక్తికి శిశువును విక్రయించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఉన్న వారం రోజులు కవలలు అక్కడే ఉన్నారు. అయితే, డిశ్చార్జ్‌ రోజున విక్రయించిన మగ బిడ్డను ఆ వ్యక్తికి అప్పగించినట్లు తెలుస్తోంది. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఆ దంపతులు ఇంటికి చేరారు. 
 
అయితే, రెండో బిడ్డ లేకపోవడంతో అనుమానం వ్యక్తంచేసిన స్థానికులు విలేకరులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని దశరథ్‌ దంపతులను అడుగగా పొంతన లేని సమాధానం చెప్పారు. బిడ్డను విక్రయించినట్లు స్థానికులు కూడా చెబుతున్నారు. అధిక మొత్తంలో డబ్బు తీసుకొని విక్రయించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఆస్పత్రిలో వివరాలు సేకరించగా ఈ నెల 17 విన్నా కవలలకు జన్మనిచ్చినట్లు వైద్యురాలు అనురాధ తెలిపారు.
 
అయితే, తల్లిదండ్రులు మాత్రం దీనిపై మరోలా స్పందిస్తున్నారు. తాము మగ బిడ్డను విక్రయించలేదని, హైదరాబాద్‌లో ఉంటున్న మరిదికి దత్తత ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు. తమకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, మరో ఇద్దరు పుట్టడం వల్ల పిల్లలులేని మరిదికి ఇచ్చామన్నారు. విక్రయించారన్న దానిలో నిజం లేదన్నారు. మరో వారం రోజుల్లో దత్తత కాగితం కూడా రాసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం దీనిపై మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.