గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (15:14 IST)

కేసీఆర్‌పై కోపంతోనే పవన్ - విజయశాంతిలు వివరాలివ్వలేదా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో హైదరాబాద్‌లో ఉండే సినీ నటుడు పవన్ కళ్యాణ్, నటి విజయశాంతి వంటి వారు పాల్గొనకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, మరో దఫా జరిగే సర్వేలో వారు వివరాలిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. 
 
సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఇరు ప్రాంతాల్లో టీడీపీ బీజేపీ తరపున ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. సమయం వచ్చినప్పుడల్లా అతనిపై మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో టి సర్కారు చేపట్టిన సర్వేలో పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం చర్చనీయాంశమైంది. అదేసమయంలో విజయశాంతి కూడా సర్వేలో పాల్గొనక పోవడం చర్చకు దారి తీసింది. తెలంగాణ బిడ్డగా విజయశాంతి చెప్పుకుంటారు. సర్వేలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుండి సైతం ప్రజలు వచ్చారు. అలాంటిది తెలంగాణ బిడ్డగా చెప్పుకోవడమే కాకుండా, తెలంగాణ కోసం ఉద్యమించిన విజయశాంతి పాల్గొనక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ సమగ్ర సర్వేలో పాల్గొనక పోవడంపై కేసీఆర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉండదలుచుకోలేదేమోనని, కేవలం టూరిస్టుగానే తెలంగాణలో ఉండదలుచుకున్నాడేమోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమగ్ర సర్వేలో వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మ అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.