శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (13:48 IST)

విద్యుత్ ఉద్యోగుల పంపిణీ.. కోర్టులో తేల్చుకోండి.. చేతులెత్తేసిన హోంశాఖ!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల పంపిణీ వివాదం పెను సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర హోంశాఖ చేతులెత్తేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. 
 
వాస్తవానికి ఈ సమస్య పరిష్కారంపై శుక్రవారం కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల వాదనలు విన్న హోంశాఖ ఉన్నతాధికారులు, వివాదాన్ని కోర్టు పరిధిలోనే తేల్చుకోండని చెప్పి సమావేశాన్ని ముగించారు. 
 
దీంతో వివాదం పరిష్కారం కానుందన్న భావనతో అక్కడికి వెళ్లిన కృష్ణా రావు, రాజీశ్ శర్మలు తలలు పట్టుకున్నారు. ఏపీ మూలాలు ఉన్నాయన్న వాదనతో తెలంగాణ సర్కారు 1249 మంది ఏపీ మూలాలున్న విద్యుత్ ఉద్యోగులను విధుల్లో నుంచి తప్పించి ఏపీకి బదలాయించింది. అయితే ఒకేసారి అంతపెద్ద సంఖ్యలో ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం తమకు సాధ్యం కాదని ఏపీ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.
 
మరోవైపు విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారమే జన్మస్థలం ఆధారంగా స్థానికతను నిర్ధారించి, ఏపీ మూలాలున్న విద్యుత్‌ ఉద్యోగులను గుర్తించి అక్కడికి బదిలీ చేశామని తెలిపింది. విభజన చట్టం ప్రకారం విభజన జరిగిన ఏడాది తర్వాత ఉద్యోగులను విభజించవచ్చని, ఆ ప్రకారమే తాము విద్యుత్‌ ఉద్యోగులను విభజించామని వివరించింది. 
 
ఇదిలావుండగా, జన్మస్థలం ఆధారంగా స్థానికతను నిర్ణయించి ఆరుగురు జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ.. ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు తాజాగా బదిలీ చేసింది. ఆ ఆరుగురు ఉద్యోగులను చేర్చుకునేందుకు ఏపీ జెన్‌కో అంగీకరించలేదు. గతంలో తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా, కోర్టుల్లో కేసులున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వద్ద సమావేశం ఉన్నప్పటికీ.. ఈ బదిలీలు చేయడంపై ఏపీ జెన్‌కో వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర హోంశాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకువెళ్లింది. అయినప్పటికీ.. కేంద్ర హోంశాఖ చేతులెత్తేసింది.