మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (12:23 IST)

సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడరా?... హ్హి..హ్హి..హ్హీ...!

టెన్నిస్ తార సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతోపాటు ఆమెకు కోటి రూపాయల నజరానాను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం పట్ల భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం మీద తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. 
 
తెలుగు భాష రాని సానియా మీర్జా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రచారకర్తనా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి 1956 నిబంధన విధించారు కదా.. మరి సానియా మీర్జా కుటుంబం 1956 ముందు నుంచే తెలంగాణలో వుందా? ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించుకుందా? అని అడుగుతున్నారు. సానియా మీర్జా తండ్రి మహారాష్ట్రలో జన్మించాడు. సానియా భర్త పాకిస్థాన్‌ వాసి. సానియా మీర్జా దుబాయ్‌లో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంది. అలాంటి సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా? ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
అంతేకాకుండా, సానియా మీర్జా తెలంగాణకు గర్వకారణమా? ఏరకంగా గర్వకారణం? జాతీయ పతాకాన్ని అవమానించడం తెలంగాణాకు గర్వకారణమా? ఆమె తెలంగాణ కోసం ఏం చేసిందని గర్వపడుతున్నారు? సానియా మీర్జా కనీసం తన కలలో అయినా జై తెలంగాణ అని నినాదం చేసి వుంటుందా? తెలంగాణ ఉద్యమానికి మద్దతు అయినా పలికిందా? టెన్నిస్ క్రీడ ద్వారా, టెన్నిస్ అకాడమీ స్థాపించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన సానియా మీర్జాకు కోటి రూపాయలు ఇచ్చారు. 
 
మరి ప్రాణాలకు తెగించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఇద్దరు తెలంగాణ చిన్నారులకు ముష్టిగా రూ.25 లక్షలు చొప్పు ఇచ్చారు. ఇదేనా మీ న్యాయం.? ఎంతోమంది బంగారు తల్లులు వున్న తెలంగాణ గడ్డమీద తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి అచ్చ తెలంగాణ ఆడపడుచు ఎవరూ కేసీఆర్ కంటికి కనిపించలేదా.? ఇత్యాది ప్రశ్నలు అనేకం సంధిస్తున్నారు.