శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (15:20 IST)

అవినీతి మంత్రులను ఇంటికి పంపాల్సిందే : రేణుకా చౌదరి

ఎన్డీయే ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను ఇంటికి సాగనంపేవరకు పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రకటించారు. సోమవారం కూడా రాజ్యసభ కార్యక్రమాలకు విపక్ష పార్టీలు ఆటంకం కలిగించడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేసింది. 
 
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులు రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదని, పార్లమెంట్‌ సమావేశాలు జరగనివ్వమన్నారు. గత 10 రోజులుగా సభా కార్యక్రమాలు నిలిచిపోతే ఇప్పుడు చర్చలు చేపట్టడం అర్థరహితమని అధికార పార్టీని విమర్శించారు. 
 
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌, ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు వసుంధర రాజే, శివరాజ్‌ చౌహాన్‌ రాజీనామా చేసి తీరాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. తమ ప్రాథమిక డిమాండ్లు నెరవేర్చకుండా ఇన్నాళ్లు కాలయాపన చేసి ఇప్పుడు చర్చలకు పిలవడాన్ని రేణుకా చౌదరి తప్పుపట్టారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగాలంటే ఆ ముగ్గురు రాజీనామా చేయాల్సిందేనని ఆమె తెల్చి చెప్పారు.