గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (18:06 IST)

పవన్ కల్యాణ్‌ మాటల్లో నిజముందన్న రేవంత్ రెడ్డి.. జనసేనలోకి చేరుతారా?

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు కొట్టేసిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రస్తుతం క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక.. రేవంత్ రెడ్డికి.. తెలంగాణలో టీడీప

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు కొట్టేసిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రస్తుతం క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక.. రేవంత్ రెడ్డికి.. తెలంగాణలో టీడీపీ పార్టీకి మార్కులు పడిపోయాయ్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రేవంత్ రెడ్డిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంచి.. తెలంగాణలో సత్తా చాటాలనుకున్న చంద్రబాబుకు చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కారు.. రేవంత్ రెడ్డిని పక్కాగా టార్గెట్ చేసింది. 
 
ఈ కేసు నుంచి రేవంత్ రెడ్డికి ఊరట లభించినప్పటికీ.. తెలంగాణ టీడీపీకి తగినంత గుర్తింపు లభించట్లేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారుకే మంచి క్రేజుంది. కాంగ్రెస్ ప్రతిపక్షమైనప్పటికీ.. నోరెత్తలేని పరిస్థితిలో వుంది. ఎత్తినా అధికార పార్టీ చేతిలో విమర్శలకు, కౌంటర్లకు చిక్కుకుంటుంది. తెలుగుదేశం వంటి ఇతర పార్టీలకు ఇంతే పరిస్థితి. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో సత్తా చాటాలనుకుంటున్నారు. 
 
ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజా గాయకుడు గద్దర్‌తో పవన్ భేటీ అయ్యారు. గద్దర్‌ కూడా తన మిత్రుడైన పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసేందుకు సానుకూలంగా ప్రకటించారు. ఇలా ఉద్యమంలో పాల్గొన్న వారిని జనసేనలోకి తీసుకుని తెలంగాణలో పాగా వేసేందుకు జనసేన భావిస్తోంది. అటు ఏపీలోనూ తనకు సానుకూల పవనాల కోసం జనసేనాని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి పవన్ కల్యాణ్‌ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ఏకీభవించారు. 
 
పవన్ కల్యాణ్ మాటల్లో వాస్తవముందన్నారు. ఆయన ఆవేదన సరైందేనని చెప్పారు. ఎన్నికల్లో పొత్తులనేవి చాలా సహజమైన ప్రక్రియ అని చెప్పారు. తెలంగాణలోని పార్టీలన్నీ కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయని చెప్పారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామన్నారు. పార్టీ అభివృద్ధి ప్రణాళికే లక్ష్యంగా మహానాడును నిర్వహిస్తున్నామని... ఐదు కీలక అంశాలపై తమ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి జనసేనలో చేరుతారని.. తద్వారా తెలంగాణలో తిరిగి క్రేజ్ సంపాదించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.