మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (12:42 IST)

రేవంత్ రెడ్డికి బెయిల్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నారా...?! ఎందుకు...?!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డికి మంగళవారం నాడు బెయిల్ లభించింది. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా సస్పెన్షన్ వేటు వేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోందన్న వార్తల నేపధ్యంలో రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే టి.టిడిపి నాయకులు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి బెయిల్ లభించినందుకు కుటుంబసభ్యులు ఆనందోత్సాహాలతో ఉన్నారు.
 
కాగా ఓటుకు నోటు కేసులో ఏ-1 నిందితుడు అయిన రేవంత్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల వ్యక్తిగత పూచికత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులైన ఏ-2 సెబాస్టియన్, ఏ-3 ఉదయ్ సింహలకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 
అంతకుముందు.. హైకోర్టులో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిలు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై వాదోపవాదాలు జరిగాయి.  మొదలయ్యాయి. ఏసీబీ తరఫున వాదన వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపించేందుకు ముందే కేసుకు సంబంధించిన మరిన్ని సాక్ష్యాధారాలతో కూడిన పత్రాలను అందించారు. 
 
ఈ కేసులో నాలుగో ముద్దాయి మత్తయ్య ఇంకా దొరకలేదని, ఆయన న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పారు.  సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నందున రేవంత్‌కు బెయిల్ ఇవ్వద్దొని వాదించారు. ఈ సమయంలో బెయిలు ఇస్తే కేసు నీరుగారిపోతుందని న్యాయస్థానానికి తెలిపారు. అయితే వాదనలు విన్న కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. మీడియా ముందు మాట్లాడకూడదని, ఏసీబీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.