శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 జులై 2015 (15:52 IST)

కత్తుల్లాంటి లాయర్లను రంగంలోకి దిగినా... ప్చ్, రేవంత్‌ తెలంగాణ పులిబిడ్డ అంటూ...

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి అరెస్టు కావడం, ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చీ రాగానే తెలంగాణ ముఖ్యమంత్రిపైన తూటాల్లాంటి వ్యాఖ్యలు చేయడంతో టి.తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. తన తదుపరి 30 ఏళ్ల జీవితాన్ని కేసీఆర్‌ను తెలంగాణ ప్రజల చేత తరిమికొట్టించేదుకే వినియోగిస్తానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టి.సర్కార్ చాలా సీరియస్‌గా తీసుకుంది. 
 
సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయించేందుకు ముగ్గురు కత్తుల్లాంటి న్యాయవాదులను రంగంలోకి దింపింది. కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబాల్, దుష్యంత్ దేవ్, హరేన్ రావెల్ న్యాయవాదులను రేవంత్ బెయిల్ రద్దుపై వాదించేందుకు రంగంలోకి దింపింది. ఐతే ఈ న్యాయవాదులు రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు విషయంలో చేసిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఏసీబితోపాటు టి.సర్కారుకు చుక్కెదురైంది.
 
1 రోజు జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తి గురించి ఆలోచన చేయవచ్చు కానీ... 30 రోజులపాటు జైల్లో ఉండి ఏసీబికి సహకరించిన రేవంత్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయడం కుదరదని తేల్చే చెప్పింది. రేవంత్ రెడ్డి బైయిలుపై మళ్లీ ఏ కోర్టుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తెలంగాణలో టి. తమ్ముళ్ల సంబరాలు మిన్నంటుతున్నాయి. రేవంతన్న తెలంగాణ పులిబిడ్డ అంటూ నినాదాలు చేస్తున్నారు.