బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (11:06 IST)

టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్.. ఏంటది.. ఎవరిచ్చారు?

తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ యువనేత రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాషాయదళంలో చేరితే 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనంటూ ఆశచూపింది. అయితే, ఈ ఆఫర్‌ను రేవంత్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. ఇంతకీ రేవంత్ రెడ్డికి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరు.. ఎక్కడ అనే అంశాలను పరిశీలిస్తే... 
 
టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి ఎవరు? సదరు కేంద్ర మంత్రిని రేవంత్ ఎక్కడ కలిశారు? ఆ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? పార్టీలో చేరితే రేవంత్‌కు ఆ మంత్రి ఇచ్చిన ఆఫర్ ఏమిటి? మిత్రపక్షం అగ్రనేతను కమలం గూటికి ఆహ్వానించాలన్న ఆలోచన ఆ కేంద్ర మంత్రికి ఎందుకు వచ్చింది? కేంద్ర మంత్రి ఆఫర్‌కు  రేవంత్ ఇచ్చిన కౌంటర్ ఏమిటి?
 
టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలు మొదలు లక్షలాది మంది పార్టీ కేడర్‌కు రేవంత్‌ రెడ్డి పట్ల మంచి పేరుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అని అయిదు లక్షల మంది కార్యకర్తలను ఐవీఆర్‌ఎస్‌లో ప్రశ్నిస్తే ముక్తకంఠంతో చెప్పిన పేరు రేవంత్‌ రెడ్డి. ఏకంగా 92 శాతం మంది రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్నారు. పార్టీలో అంతర్గత కారణాల రీత్యా చంద్రబాబు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు ప్రమోషన్ ఇచ్చి సరిపెట్టారు. రేవంత్ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే భవిష్యత్‌కు పునాదులు వేసుకుంటున్నారు.
 
ఈనేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నుంచి బహిరంగ ఆఫర్ వచ్చింది. మా పార్టీలో చేరండి అంటూ కేంద్ర మంత్రి హన్సరాజ్ పిలుపునిచ్చారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచార సందర్భంగా రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి ఆహ్వానించారు. వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రేవంత్ వెళ్లగా, అదేసమావేశానికి హన్సరాజ్ గంగారాం కూడా వచ్చారు. ఓ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. సహజంగా తన మాటల తూటాలతో జనాన్ని ఉర్రూతలూగించడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య. అదే ఆయనను మాస్ లీడర్‌ను చేసింది. అదే ఓరవడిలో సదరు సభలో రేవంత్ ప్రసంగంతో హోరెత్తించారు. రేవంత్ ప్రసంగానికి సభ చప్పట్లు... ఈలలతో దద్దరిల్లిపోయింది. అదే సభలో ఉన్న హన్సరాజ్ ఇది గమనించారు. 
 
రేవంత్ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. పనిలో పనిగా బీజేపీలో చేరండి... మీరు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపిక చేయిస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు. కానీ రేవంత్ మాత్రం... హన్సరాజ్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను తెలుగుదేశం పార్టీలో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. తమ నాయకుడు చంద్రబాబు అతి తక్కువ కాలంలోనే తనకు ఉన్నత అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు.