గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (18:11 IST)

ఆరోపణలు నిజం - తప్పని రుజువు చేస్తే గుండు గీయించుకుంటా : రేవంత్

మెట్రో రైల్ ప్రాజెక్టుపై తాను చేసిన ఆరోపణలు అక్షరాలా నిజమని, తప్పని తెరాస నేతలు రుజువు చేస్తే తాను గుండు గీయించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి తప్పని తేలితే రేవంత్ గుండు గీయించుకుంటారా అని తెరాస నేతలు ఆదివారం ప్రశ్నించారు. 
 
దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ నేతల సవాళ్లకు వీడియో సాక్ష్యం రూపంలో సమాధానం ఇచ్చారు. జనవరి 8వ తేదీన మైహోం రామేశ్వర రావు గారే రూ.రెండు వేల కోట్లకు భూములు కొన్నానని చెప్పారని తెలిపారు. ఈ మేరకు జనవరి 8న పొన్నాల లక్ష్మయ్య సభను అడ్డుకునేందుకు హరీష్ రావు, జూపల్లి ఇతర టీఆర్ఎస్ నేతలతో మై హోం రామేశ్వరరావు కలిసి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి సభను అడ్డుకున్నది వాస్తవం కాదా? అని ఆయన అడిగారు.
 
అలాగే, గేమింగ్ సిటీలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన రామేశ్వరరావు, అంతకంటే గొప్పదైన, ప్రజల అవసరాలు తీర్చే మెట్రోరైల్ కోసం ఆ భూమిని కేటాయించవద్దని ఎందుకు ఆందోళన చేశారని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వం కేటాయించకుండా నిలిపేసిన భూములను, తెరాస ప్రభుత్వం ఎలా కేటాయించిందని రేవంత్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రదర్శించారు. 
 
మరి వీటిపై దొరల నేతలు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గతంలో ఆ ఫైల్‌ను పక్కన పెట్టిన అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి కారణం ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. డీఎల్ఎఫ్‌కు సంబంధించిన భూములు ఎవరికి? ఎందుకు? కేటాయించారని ఆయన నిలదీశారు. భూకేటాయింపుల మార్పును ఒప్పుకోమని ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమా? కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 
 
ఏపీఐఐసీ ఈడీ చెప్పిన ప్రకారం ఈ భూబదలాయింపులు ఆగస్టులో జరిగినట్టు తెలిపారు. అంటే ఆగస్టులో ఉన్న ప్రభుత్వమేదని ఆయన ప్రశ్నించారు. కేవలం నెలల కాలంలోనే రామేశ్వరరావుకు ఎలా భూకేటాయింపులు చేశారని ఆయన అడిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు పాల్పడకపోతే, తక్షణం అఖిలపక్షం నిర్వహించి, మెట్రో రైల్ పై ఫైళ్లన్నీ స్పీకర్ సమక్షంలో పరిశీలిద్దామని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ భూకేటాయింపు తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
దీనిని రద్దు చేయకపోతే శాసనసభను స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ భూ కేటాయింపులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తనపై పరువు నష్టం దావా వేస్తానంటున్నవారు వారి పరువు మర్యాదలను సరిచూసుకోవాలని ఆయన హితవు పలికారు.