గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (17:54 IST)

ఆంధ్రాకు ఒక్క పైసా తరలించొద్దు : రాజీవ్ శర్మ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క పైసా కూడా సీమాంధ్ర ప్రాంతంలోని బ్యాంకులకు తరలించవద్దని తెలంగాణ ప్రాంతంలోని అన్ని బ్యాంకర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. 
 
తెలంగాణ కార్మిక శాఖలోని నిధులు దారి మళ్లించిన సంఘటన వెలుగులోకి రావడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. దీంతో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయకుండా ఎలాంటి నిధుల మళ్లింపు జరపరాదని బ్యాంకర్లను కోరారు. ఉమ్మడి రాష్ట్రాల బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఏపీ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గద్దని ఆయన కోరారు. 
 
ఒకవేళ ఏపీ అధికారులు ఒత్తిడి తెస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను బ్యాంకర్లకు అందజేశారు. కాగా, ఇవాళ బ్యాంకర్లతో సీఎస్ జరిపిన సమావేశంలో ఏపీ కార్మిక శాఖ ఖాతాలోకి రూ.609 కోట్లు, ఏపీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఖాతాలోకి రూ.20 కోట్లు తరలించినట్లు గుర్తించారు.