శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (15:37 IST)

స్మితా సభర్వాల్‌పై ఔట్‌లుక్ అసభ్య క్యారికేచర్‌... కేసీఆర్ ఆగ్రహం.. చర్యలు తీసుకోండి!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసభర్వాల్‌పై ఆంగ్ల మ్యాగజైన్ 'ఔట్‌లుక్' ఒక అసభ్యకర క్యారికేచర్‌ను ప్రచురించింది. స్మితాసభర్వాల్ అభ్యంతరకర దుస్తులతో ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా... సీఎం కేసీఆర్‌ ఫొటో తీస్తుంటే కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆ క్యారికేచర్‌ను ముద్రించింది. 
 
ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మల దృష్టికి తీసుకెళ్లిన ఆమె కన్నీరుమున్నీరైనట్లు సమాచారం. తన ఎదుగుదల చూసి ఓర్వలేనివారే ఈ పని చేయించారని ఆక్షేపించారు. దీంతో సంబంధిత పత్రికపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రాజీవ్ శర్మలు ఆదేశించినట్టు సమాచారం. ఇందులోభాగంగా ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు స్మితాసభర్వాల్‌ మంగళవారం ఆ పత్రికకు లీగల్‌ నోటీసు పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా క్యారికేచర్‌ ప్రచురించడంపై 15 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రెవెన్యూ జేఏసీ ఆమెకు సంఘీభావం ప్రకటిస్తూ ఔట్‌లుక్‌పై మండిపడింది. పత్రిక బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.