శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (09:21 IST)

అరెస్టయిన ఒక్క రోజులోనే బెయిలివ్వమన్న సందర్భాలు లేవా? : సిబల్‌కు సుప్రీం సీజే చురక

కేంద్ర మాజీ మంత్రి, దేశంలో పేరొందిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు చురక అంటించారు. కొన్ని కేసుల్లో నిందితుడికి అరెస్టు చేసిన ఒక్కరోజులోనే బెయిల్ మంజూరు చేయాలని కోరిన సందర్భాలు లేవా అని ప్రశ్నించారు. ఇలాంటి పలు కేసుల్లో మీరు (సిబల్) వాదనలు వినిపించారని గుర్తుచేయడంతో తెలంగాణ ఏసీబీ తరపున హాజరైన కపిల్ సిబల్ మిన్నకుండిపోయారు. 
 
ఓటుకు నోటు కేసులో టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ వేసినా, ఒక దశలో బెయిల్‌ రద్దు చేయాలని సెబాస్టియన్‌, ఉదయ సింహలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ గురువారం సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన విషయంతెలిసిందే. ఈ పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు, న్యాయమూర్తులు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమితావ రాయ్‌ల ధర్మాసనం ముందు శుక్రవారం ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ ఏసీబీ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.
 
ఈ కేసులో కపిల్ సిబల్ వాదలు పూర్తయిన తర్వాత త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. 'నేరం రుజువైతే ఐదేళ్ల జైలుశిక్ష పడే కేసు ఇది. నిందితుడు నాలుగు రోజులు మీ కస్టడీలోనే ఉన్నాడు. అతని వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినా నెల రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఎందుకు అడుగుతున్నారు? మళ్లీ అతన్ని జైల్లో పెట్టడం ఎందుకు?' అని నిలదీసింది. 
 
బెయిల్‌ పొందిన వెంటనే బయటకు వచ్చిన నిందితుడు చాలా తలబిరుసుగా మాట్లాడారని, ఆయన ప్రసంగంపై కూడా పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని సిబల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా స్పందిస్తూ 'అసలు నిందితులను నెల రోజులపాటు జైల్లో ఎందుకు పెట్టారు?' అని ప్రశ్నించారు. దాంతో సిబల్‌ మాట మార్చారు. తాము (సెక్షన్‌ 439 కింద) బెయిల్‌ను రద్దు చేయాలని కోరడం లేదని, అసలు బెయిల్‌ రద్దుకు పిటిషన్‌లో పేర్కొన్న కారణాలు సరితూగవని మాత్రమే కోర్టు దృష్టికి తెస్తున్నట్టు తెలిపారు. 
 
దీనికి జస్టిస్‌ దత్తు స్పందిస్తూ నెల రోజులపాటు నిందితుడు జైల్లో ఉన్నాడు కదా! అని ప్రశ్నించారు. 'నెల రోజుల్లో నాలుగు రోజులు విచారణ చేశారు. వాంగ్మూలం కూడా నమోదు చేశారు. నిందితుడిని విచారించడం పూర్తయ్యింది. అలాంటప్పుడు సెక్షన్‌ 439 కింద బెయిల్‌ రద్దు చేయాలని కోరడం, జైల్లో పెట్టడం ఎందుకు!?' అని ప్రశ్నించారు. 1985లో సుప్రీంకోర్టు చెప్పినట్లుగా.. బెయిల్‌ ఇచ్చే విషయంలో న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుందన్నారు. 'హై ప్రొఫైల్‌ కేసుల్లో ఇవ్వాళ అరెస్ట్‌ చేసి రేపు బెయిల్‌ ఇవ్వడాన్ని నిరోధించాలి. విచక్షణాధికారం దుర్వినియోగమైందని భావిస్తే మేం జోక్యం చేసుకోవాలి. కానీ, ఈ కేసులో నెలరోజులు నిందితుడు జైల్లో ఉన్నాడు. వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు బెయిల్‌ ఇవ్వటాన్ని ఇప్పుడు మీరు శంకిస్తున్నారా?' అని ప్రశ్నించారు. 
 
ఈ ప్రశ్నతో షాక్‌కు గురైన సిబల్... తాను అలా అనడం లేదని, అయితే ఇదే సూత్రాన్ని అన్ని కేసుల్లోనూ అందరు నేరస్తులకూ వర్తింపచేయాలని సిబల్‌ సమాధానం ఇచ్చారు. బెయిల్‌ ఇవ్వడంలో తాము ఉదారంగానే వ్యవహరిస్తుంటామని, వాస్తవానికి, అరెస్టయిన వెంటనే బెయిల్‌ కావాలన్న కేసుల్లో కూడా మీరు వాదనలు వినిపించారని జస్టిస్‌ దత్తు సిబల్‌కు గుర్తు చేశారు. అందువల్ల టీ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.