బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR

స్వైన్ ఫ్లూ దెబ్బకు టి రాజయ్య ఔట్?.. చిక్కని కేసీఆర్ దర్శనం... ఎపుడైనా రిజైన్!

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖామంత్రి టి రాజయ్య పదవి ఊడటం ఖాయమని తేలిపోయింది. దీనికి కారణం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును దర్శనం చేసుకునేందుకు ఆయన గత రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా.. తెరాస చీఫ్ దర్శన భాగ్యం దక్కలేదు. పైగా.. సచివాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేషీలో పని చేస్తున్న అధికారులందరిపై సీఎం కార్యాలయం వేటు వేసింది. దీంతో రాజయ్యకు ఉద్వాసన తప్పదని తేలిపోయింది. 
 
తెలంగాణ ప్రజలను పీడిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ మహమ్మారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా, వైద్య ఆరోగ్య శాఖలో వివిధ పోస్టుల భర్తీ విషయంలో జరిగిన అవకతవకలపై కేసీఆర్ చాలా గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం రాజయ్య పేషీ అధికారులందరిపైనా వేటు వేసిన కేసీఆర్, మొత్తం పేషీని ప్రక్షాళన చేయాలని హుకుం జారీ చేశారు. 
 
కాగా, శనివారం రోజంతా సచివాలయంలోని తన కార్యాలయంలోనే ఉన్న రాజయ్య, సీఎంను కలవడానికి రెండు మూడు సార్లు ప్రయత్నించినా కేసీఆర్ సుముఖత చూపనట్టు తెలుస్తోంది. రెండు సార్లు ‘సి’ బ్లాక్ వద్దకు వచ్చిన రాజయ్యకు సీఎం అపాయింట్‌మెంట్ దక్కలేదు. మరోవైపు రాజయ్యను కలవడానికి ఆ శాఖ అధికారులెవరూ కూడా రాలేదు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. నేడు కేసీఆర్‌తో మాట్లాడేందుకు అవకాశం లభించకుంటే నేడో రేపో ఆయన రిజైన్ చేయవచ్చని సమాచారం.