శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (08:34 IST)

విచారణ జరిపించండి.. కడిగిన ముత్యంలా బయటకు వస్తా : టి రాజయ్య

తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తే కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మంత్రి టి రాజయ్య అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. వైద్యుల సూచనలు తోసిరాజని... వెంటనే డిశ్చార్జి అయ్యారు. అక్కడే మీడియాతో మాట్లాడారు.
 
ఈ సందర్భంగా ఆయన తన మనస్సులోని మాటలను వెల్లడించారు. తండ్రిలాంటి కేసీఆర్‌.. నేను చేసిన పొరపాట్లపై విచారణ జరిపించాలి అని వినయపూర్వకంగా డిమాండ్‌ చేశారు. ‘నేను చేసిన పొరపాటు ఏమిటో తేల్చండి. తప్పకుండా విచారణ జరిపించండి’... అంటూ ఆయన వినయపూర్వక డిమాండ్ చేశారు.
 
అంతేకాదు... విచారణ జరిపితే కడిగిన ముత్యంలా బయటికి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. నిజానికి నాకు ముందు నుంచే బీపీ, షుగర్‌ ఉన్నాయి. నాలుగు రోజులుగా ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు. నేను వైద్యుడినే అయినా ఎందుకనో బీపీ కంట్రోల్‌ చేసుకోలేకపోయాను. బీపీ 130-80 ఉంది. షుగర్‌ లెవల్స్‌ 340కి చేరింది. నిజానికి... అంతకుముందే ఆస్పత్రికి వద్దామనుకున్నా. అభిమానులు, కార్యకర్తలు మరోలా అనుకుంటారని ఇన్నాళ్లూ ఎలాగో నెట్టుకువచ్చాను. 
 
ఇప్పుడు ఒక్కసారిగా చెమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు నన్ను ఆస్పత్రిలో చేర్పించారని వివరించారు. బర్తరఫ్‌ తర్వాత తాను ఒత్తిడికి గురైన మాట వాస్తవమేనని చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని ఆక్రోశించారు. తండ్రిలాంటి ముఖ్యమంత్రి గారు నేను చేసిన పొరపాట్లపై విచారణ జరిపించాలి. ఏ విచారణ జరిపినా, తప్పకుండా కడిగిన ముత్యంలా బయటపడతాను అని చెప్పారు. చికిత్స చేయించుకోవాలని వైద్యులు చేసిన సూచనను కాదని... తన అభిమానులు, ప్రార్థనాపరులకు అందుబాటులో ఉండేందుకు ఇంటికి వెళ్తున్నానని రాజయ్య వివరణ ఇచ్చారు. 
 
మంగళవారం సాయంత్రం రాజయ్య ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి, అధిక రక్తపోటు, షుగర్‌, ఒళ్లంతా చెమటలు పట్టడంతో... అసెంబ్లీ సమీపంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆయన అనుచరులతోపాటు పార్టీలకు అతీతంగా దళితనేతలు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటల తర్వాత... రాత్రి 9.30 గంటల సమయంలో రాజయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ‘ఆస్పత్రిలో చికిత్స అవసరమన్న తమ సూచనను తోసిరాజని ఆయన డిశ్చార్జి అయ్యారు’ అని వైద్యవర్గాలు తెలిపాయి.