శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (12:01 IST)

చంద్రబాబుకు షాక్: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లోకి మంచిరెడ్డి!

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కష్టాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అధికారం ఉండటంతో టీడీపీకి చెందిన నేతలంతా పదవుల కోసం ఇతరత్రా కారణాల కోసం సొంత పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన తలసాని వంటి సీనియర్ నేతలు సైతం టీఆర్ఎస్‌లోకి చేరిపోతే.. తాజాగా టీ.టీడీపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరుతున్న మంచిరెడ్డి ప్రకటించని సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. హైదరాబాదులోని తెలంగాణ వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన గెలవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
 
అటు టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి ముందు కూడా టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తల మద్దతుతో గెలిచిన ధర్మారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హన్మకొండలోని ఆయన నివాసం ఎదుట ఆందోళన చేశారు. ధైర్యం ఉంటే టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన గెలవాలని సవాల్ విసిరారు. చెప్పులు, చీపుర్లు పట్టుకుని చావు డప్పు వాయిస్తూ వినూత్న నిరసన తెలిపారు.