గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2014 (17:29 IST)

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేకి రిజైన్!!

తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఉదయం 8 గంటలకు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
గడచిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై సనత్ నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో తలసాని తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని టీ టీడీపీ పలుమార్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 
 
తన రాజీనామా విషయాన్ని మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. నైతిక విలువలు, ప్రజాస్వామ్యంపై తనకు అపార గౌరవముందన్నారు. ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తాను ఎవరో చెబితే నేర్చుకునే స్థితిలో లేనని ఈ సందర్భంగా తలసాని వ్యాఖ్యానించారు. శాసనసభ్వత్వానికి రాజీనామా చేస్తూ లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపానన్నారు. 
 
ఇక, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయన్న ఆయన, మున్ముందు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. సనత్ నగర్ ప్రజల ఆప్యాయతను మరిచిపోలేనని వ్యాఖ్యానించిన తలసాని ఇకపై జంట నగరాల అభివృద్ధికి పాటుపడతానని వెల్లడించారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఇకనైనా తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.