శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (09:20 IST)

నాడు మిగులు బడ్జెట్.. నేడు నిధుల కొరత.. ఇదీ తెలంగాణ దుస్థితి!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన వెంటనే దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ రెండో రాష్ట్రంగా అవతరించిందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కూడా. దీనికి కారణం ఆదాయాన్ని సమకూర్చే హైదరాబాద్‌ కూడా తెలంగాణాలో కలిసిపోవడమే. ఫలితంగా తెలంగాణలో నిధులు పుష్కలంగా ఉండగా, ఏపీ మాత్రం ఆర్థిక లోటుతో అల్లాడిపోతోంది. 
 
2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం లక్ష్యాలకు ధీటుగా వచ్చినా.. ఖర్చు అవసరాలకు ఆ ఆదాయం సరిపోవడం లేదు. భారీ లక్ష్యాలతో రెండో ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించిన టీఎస్ ప్రభుత్వానికి ఊహించని రీతిలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ తేరుకోలేని షాకిచ్చింది. ఎక్సైజ్‌ అమ్మకాలపై ఆదాయ పన్ను చెల్లించే విషయంలో రిజర్వు బ్యాంకు సహకారంతో 1260 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేసుకుంది. ఈ అనూహ్య పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వ నిధుల నిర్వహణ వ్యవహారం ఒక్కసారిగా తలకిందులైంది. 
 
ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ క్రమశిక్షణలో ప్రధానమైన రాబడి - చెల్లింపులు (వేస్ అండ్ మీన్స్) పరిస్థితి ప్రమాదంలో పడింది. ఈ కారణంగానే సదరు రూ.1,260 కోట్లు తిరిగి తన ఖాతాలో చేరితే కాని తెలంగాణ సర్కారు జూన్ మాసం బిల్లులను చెల్లించే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో వెనువెంటనే రంగంలోకిదిగిన తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మలు కేంద్రాన్ని శరణువేడారు. ఆ నిధులను వెంటనే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా చేయాలనికోరారు. 
 
దీనికి స్పష్టమైన హామీ ఇవ్వని కేంద్రం... ‘ఏదో ఒక రూపంలో సాయం చేస్తాం’ అన్న మాట సాయం మాత్రమే చేసింది. దీనికి సంతృప్తి చెందని తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు.. ఏ రూపంలో సరిదిద్దినా.. ముందుగా రూ.1260 కోట్లను అడ్వాన్సుగా ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. అనూహ్యంగా నిధుల కొరత తలెత్తడంతో.. జూన్‌కు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని వారు చెపుతున్నారు. కేంద్రం నుంచి అడ్వాన్సు రూపంలో నిధులు వస్తే కానీ తాము బిల్లులు చెల్లించలేమని ఆర్థిక శాఖ అధికారులు చేతులెత్తేశారు.