గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (08:51 IST)

బెండకాయలమ్ముకుని బతుకుతా లేదా చచ్చిపోతా : టీ ఏఏజీ రామచందర్ రావు

ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టులో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగడం లేదని తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు ఆరోపించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనే విషయం తనకు బాగా తెలుసున్నారు. అయినప్పటికీ తన మనస్సులోని బాధను బయటకు వెళ్లగక్కకుండా ఉండలేనన్నారు. 
 
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఉమ్మడి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అక్కడ టీ ఏసీబీ తరపు న్యాయవాదులను సుప్రీం త్రిసభ్య ధర్మాసనం చీవాట్లు పెట్టి.... బెయిల్ రద్దుచేయడం కుదరదని తెగేసి చెప్పిన విషయంతెల్సిందే. 
 
ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏఏజీ రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి హైకోర్టులో నిష్పాక్షిక నిర్ణయాలు జరగడంలేదని, ప్రత్యేక హైకోర్టు ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు. పనిలోపనిగా.. ఉమ్మడి హైకోర్టులోని న్యాయమూర్తులతోపాటు సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. 
 
‘ఇలామాట్లాడడం కోర్టు ధిక్కారమేనని నాకు తెలుసు. అయినా నేను భయపడను. జైలుకు వెళ్ళేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. చావడానికి కూడా నేను తయారై ఉన్నా. అవసరమైతే రిక్షా తొక్కి బతుకుతా. లేదంటే బెండకాయలమ్ముకుంటా’ అని తెలిపారు. ‘సమాజంలో న్యాయంలేదు. ఒక న్యాయవాదిగా నా మనసు కకావికలం అవుతోంది’ అని వ్యాఖ్యానించారు.