మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (11:03 IST)

కేసీఆర్‌కు పాలనాదక్షత లేదు : తెలంగాణ బీజేపీ ధ్వజం

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏమాత్రం పాలనాదక్షత లేదని తెలంగాణ బీజేపీ నేత కృష్ణసాగర్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అసమర్థతతోనే తెలంగాణలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు.
 
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామన్న మంత్రి హరీష్ రావు అహంకారపూరిత మాటలను ఆయన తప్పుబట్టారు. బలవంతంగా ఏదైనా చేసుకుంటామంటే జీవోలు ఒప్పుకోవని... జీవోలను అనుసరించే ఏ ప్రభుత్వమైనా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని గుర్తు చేశారు. 
 
రాష్ట్రం ఏర్పడి ఇంతకాలమైనా... ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే పనిలోనే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఉన్నారని కృష్ణసాగర్ ఆరోపించారు. పరిపాలించడం చేతకాని కేసీఆర్... రాజకీయాలు చేసుకుంటూనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఎంతకాలం గడుపుతారని... ఏదో ఒక రోజు ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలు గుర్తిస్తారని అన్నారు. 
 
మరికొన్ని రోజులు గడిస్తే... కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్న కొత్త వాదాన్ని తెర మీదకు తెస్తారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో సత్సంబంధాలను పెంచుకోకుండా... ఎలా పరిపాలిస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.